యేసుని ప్రేమను నేమారకను నెప్పుడు

yeesuni preemanu neemaarakanu neppudu

🎵 AKK-173💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

యేసుని ప్రేమను నేమారకను నెప్పుడు దలఁచవే యో మనసా వాసిగ నాతని వరనామంబును వదలక పొగడవె యో మనసా ||యేసుని ప్రేమను||

1వ చరణం

పాపులకొరకై ప్రాణముఁ బెట్టిన ప్రభు నిలఁ దలఁచవె యో మనసా శాపము నంతయుఁ జక్కఁగ నోర్చిన శాంతుని పొగడవె యో మనసా ||యేసుని ప్రేమను||

2వ చరణం

కష్టములలో మన కండగ నుండిన కర్తను దలఁచవె యో మనసా నష్టములన్నియు నణఁచిన యాగురు శ్రేష్ఠుని ప్పొగడవె యో మనసా ||యేసుని ప్రేమను||

3వ చరణం

మరణతఱిని మన శరణుగ నుండెడు మాన్యునిఁ దలఁచవె యో మనసా కరుణను మన క న్నీటి దుడిచిన కర్తను పొగడవె యో మనసా ||యేసుని ప్రేమను||

4వ చరణం

ప్రార్థనలు విని ఫలముల నొసఁగిన ప్రభు నిఁక దలఁచవె యో మనసా వర్థనఁ గోరుచు శ్రద్ధతో దిద్దిన వంద్యుని పొగడవె యో మనసా ||యేసుని ప్రేమను||

5వ చరణం

వంచనలేక వరముల నొసఁగిన వరదునిఁ దలఁచవె యో మనసా కొంచెము కాని కూర్మితో దేవుని కొమరుని పొగడవె యో మనసా ||యేసుని ప్రేమను||

Report Error