దినము గతియించెను దిననాధుఁడ పరాద్రి

dinamu gathiyinchenu dinanaadhumda paraadri

🎵 TG-051💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

దినము గతియించెను దిననాధుఁడ పరాద్రి వెనుకడాఁగె నిఁ కమా మునిమాపు సంస్తవముఁ గొనుము సంప్రీతిమై ఘనుఁడ దేవా ||దినము గతియించెను||

1వ చరణం

సరవినంబరవీధి సంజ కెంజాయలు మురువుఁజూపె ప్రభువా దొరము నీ ముఖకాంతి కిరణ జాలము మాపై నెఱపరమ్ము ||దినము గతియించెను||

2వ చరణం

కటికి చీఁకటులు దిక్తటములఁ గలిపియు త్కటములైన నీ చెం గట నున్న నెట్టి సంకటమేని మమ్ముఁ దాఁకుటకు జంకు ||దినము గతియించెను||

3వ చరణం

తలఁపువలనను నోటి పలుకువలనను జెనఁటి పనులవల్ల మేము వలచి చేసిన పాపముల నెల్ల క్షమియింపుమ లఘక్షాంతి ||దినము గతియించెను||

4వ చరణం

ముమ్మరమ్మగు శోధ నమ్ములపై విజయమ్మునొంద నీ దినమ్ము మాకు సామర్ధ్యమొసఁగితివి వంద నమ్ము దేవ ||దినము గతియించెను||

5వ చరణం

ఈ దినము మాకు సమ్మోదంబుతో నిచ్చి యాదుకొన్న వరమౌ నీ దివ్యదానముల కై దేవ! మా కృతజ్ఞతను గొమ్ము ||దినము గతియించెను||

6వ చరణం

అలసిన మా దేహములకు వలసిన నిదురఁ గలుగఁజేసి నీదూ తల హస్తములలో మమ్ములను దాఁచుము భద్రముగను దేవ ||దినము గతియించెను||

7వ చరణం

అరుణోదయముననిన్నర్చించు కొఱకు నీ కరము సాఁచి మమ్ము త్వరగా మేల్కొల్పుము స్వాస్థ్య ప్రదాతవై పరమదేవ ||దినము గతియించెను||

8వ చరణం

దాత వీవె లోక త్రాత వీవె మాకు నేత వీవె యేసు నీతి సూర్యుండవి ఖ్యాతి మహిమలు నీకె కలుగుఁగాక ||దినము గతియించెను||

Report Error