ఏ పాప మెఱుఁగని యోపావన మూర్తి పాప విమోచకుండ నా పాలి దైవమా నా పాపముల కొఱ కీ పాట్లు నొందినావా ||ఏ పాప||
ముళ్లతోఁ గిరీట మల్లి నీ శిరముపై జల్లాటమున మొత్తిరా ముళ్లపోట్లకు శిరము తల్లడిల్లగ సొమ్మ సిల్లిపోతివ రక్షకా ||ఏ పాప||
కలువరి గిరి దనుక సిలువ మోయలేక కలవరము నొందినావా సిలువ నీతో మోయఁ తులువలు వేఱొకనిఁ దోడుగా నిచ్చినారా ||ఏ పాప||
చెడుగు యూదులు బెట్టు పడరాని పాట్లకు సుడివడి నడచినావా కడకుఁ కల్వరి గిరి కడ కేగి సిల్వను గ్రక్కున దించినావా ||ఏ పాప||
ఆ కాల కర్ములు భీకరంబుగ నిన్ను ఆ కొయ్యపై నుంచిరా నీ కాలు సేతులు ఆ కొయ్యకే నూది మేకులతో గ్రుచ్చినారా ||ఏ పాప||
పలువిధంబుల శ్రమలు చెలరేగఁ దండ్రికి నెలుగెత్తి మొఱలిడితివా సిలువపైఁ బలుమాఱు కలుగుచుండెడి బాధ వలన దాహము నాయెనా ||ఏ పాప||
బల్లిదుండగు బంటు బల్లెమున నీ ప్రక్కఁ జిల్లిఁ బడఁ బొడిచి నాఁడా ఉల్లోలములవలె నల్ల నీరుబుకంగఁ జల్లారెఁగద కోపము ||ఏ పాప||
కటకటా పాప సం కటముఁ బాపుట కింత పటుబాధ నొంది నావా ఎటువంటి దీ ప్రేమ యెటువంటి దీ శాంతి మెటుల వర్ణింతు స్వామి ||ఏ పాప||