మనమీ మనుమీ మనస నీ వనుదినము యేసుని సరస ఘన ధనముల నీవు రోసి దేవ తనయుని కృపఁ దల పోసి ||మనమీ మనుమీ||
మంకు తనములను విడిచి నీ భయంకర వేదనకు వెరచి యింక వడి యేసు కడ కేగి పాద పంకజముల యొద్ద దాఁగి ||మనమీ మనుమీ||
ప్రాకటముగ నొప్పు నట్టి దైవ వాక్యంబు మనమునఁ బెట్టి శ్రీ కర నాధుని నమ్మి ధాత్రి నీ కలుషమ్ములును జమ్మి ||మనమీ మనుమీ||
సృష్టి ప్రభువు నీకు లేఁడ యతని యిష్ట గుణగణమ్ములు బాడ ఇష్టము తోడను వేఁడి నీదు దుష్ట గుణమ్ముల వీడి ||మనమీ మనుమీ||
చెంతఁ జేర వల దన్నాఁడ కడు వింతెన జనకుఁడు గాఁడా చింతలు నీకిఁక నేల బహు సంతోషమున యేసు పాల ||మనమీ మనుమీ||
బిరబిర వరగురు దరికి నీ వరుగుము దురితముఁ బెరికి సురిచిరమగు యేసు కరుణ నీకు మరణపు తరి నగు నాదరణ ||మనమీ మనుమీ||
నిరతమ్ము నాతనిమీఁద నీదు దురితముల నునుపరాద త్వరితమ్ముగ నెమ్మిఁ జూపి దుష్ట చరితమ్మును వెళ్లబాపి ||మనమీ మనుమీ||
అమలాప్తుఁడు నిను డాయు నీదు శ్రమ లన్నియు వెడలఁ జేయు విమలాత్మను దయచేయ నీతి కమలాప్తుని మది కీయ ||మనమీ మనుమీ||
అంచితముగ నుతి సేయు నిన్ రక్షించిన కృపా సంస్త్యాయు నెంచుచు నాతని విభునిగఁ గీర్తించుచుఁ బరమ గురునిగ ||మనమీ మనుమీ||