పరమ వైద్యుఁడ భారతీయుల వ్యాధి
parama vaidyumda bhaaratheeyula vyaadhi
పరమ వైద్యుఁడ భారతీయుల వ్యాధి బాధలఁ బాపుమా పరుల కుపచారం బొనర్చుట పరమ విధియని చూపుమా ||పరమ వైద్యుఁడ||
ప్రేమతో వైద్యులును దాదులు పెంపుఁ బొందఁగజేయుమా గ్రామ రోగులఁ గాంచి వారికి క్షేమమును దయ చేయుమా ||పరమ వైద్యుఁడ||
భరత ఖండము నందు వైద్యపు బడులను నెలకొల్పుమా పరఁగ నీవే వైద్య శాలలఁ బాలనంబు సల్పుమా ||పరమ వైద్యుఁడ||
కుఁటి గ్రుడ్డి మూఁగ సాలలఁ గూర్మితో దర్శించుమా యంటు రోగుల యాశ్రయముల నంటి పరామర్శించుమా ||పరమ వైద్యుఁడ||
లెక్కలేని గర్భవతుల యక్కఱలను దీర్చుమా దిక్కు లేని బిడ్డలకు నీ దీవెనల సమకూర్చుమా ||పరమ వైద్యుఁడ||
యంత్రశాలల గనులయందు నలయు వారలం బ్రోవుమా మంత్ర తంత్రము లందుఁ జిక్కు న మాయకులను గావుమా ||పరమ వైద్యుఁడ||
గ్రామ వైద్య సేవఁ జేసెడి ఘనులఁ బరిపాలించుమా గ్రామవాసులఁ గూల్చు వ్యాధులఁ గాంచి నిర్మూలించుమా ||పరమ వైద్యుఁడ||
దురభిమాన మూఢ భక్తిని ద్వరగ దూర పరచుమా మరియు శుచిచే రోగములు మటు మాయ మగు నని కరపుమా ||పరమ వైద్యుఁడ||
దేహశుద్ధిని జిత్తశుద్ధిని దేశ జనులకుఁ గూర్చుమా దేహములఁ బర శుద్ధ మగు నీ దేవళములుగ మార్చుమా ||పరమ వైద్యుఁడ||