పశ్చాత్తాపము బొందుము జీవమ నీవు
pashchaaththaapamu bondumu jeevama neevu
పశ్చాత్తాపము బొందుము జీవమ నీవు ప్రభుని సన్నిధి కేగుము పశ్చాత్తాపములేని ప్రజలెవ్వరికి గాని నిశ్చయముగ గల్గు నిత్యమౌ నరకంబు ||పశ్చాత్తాపము బొందుము||
ఎంత పాపవైనను జీవము క్రీస్తు చెంత పార్థనఁ జేయుము సంతోషమును మన శ్శాంతిని నొసఁగున నంతుఁడైన విమ లాత్ముఁ డాదరించు ||పశ్చాత్తాపము బొందుము||
జారచోరకార్యము లేవైనను బారఁదోలును వేగము నారాజ్యమును వెదకు నరు లందఱకు జీవ ధార లెచ్చెదనని కోరి కర్త వచించె ||పశ్చాత్తాపము బొందుము||
వినుము ప్రభువు వాక్యము జీవము నీవు గనుము రక్షణ భాగ్యము తనువు నిత్యముగాదు నిను నీవె నమ్మకు వినయ బుద్ధిని గ్రీస్తు ఘనము వెదుకుము వేగ ||పశ్చాత్తాపము బొందుము||
దిక్కుమాలిన దానవే జీవము ప్రభుని మ్రొక్కి పరమును జేరవే నిక్కమిది నీ పాప మెక్కువగా నున్న మక్కువతో నిన్ను గ్రక్కున విడిపించు ||పశ్చాత్తాపము బొందుము||
బలములేని దానవే జీవమ యాత్మ బలము బొందుము వేగమే యిలను విద్యాధన బలముల నమ్మక కలుష జాలము వీడి కర కడకేగుము ||పశ్చాత్తాపము బొందుము||
మందపోషకుఁడు క్రీస్తు జీవమ యేసా నందపూర్ణుఁడు థీరుఁడు వందిత సత్సంఘ మందుఁ జేరిన సత్యా నందంబు నిత్యంబు నొందుచు నుందువు ||పశ్చాత్తాపము బొందుము||