వినరె మనుజులార క్రీస్తుఁ డిలనుఁ
vinare manujulaara kreesthum dilanum
వినరె మనుజులార క్రీస్తుఁ డిలనుఁ జేయు ఘనములైన పనులలోనఁ జిత్రమొక్క పని వచించెద ||వినరె మనుజులార||
మన మనంబు లలరుచుండ దినదినంబు ప్రభుని నిండు ఘన మహాద్భుతములు వినినఁ దనివిఁ దీరదు ||వినరె మనుజులార||
ఇలను బేతనియపురంబు గలదు మరియ మార్తలక్క సెలియలందు వాసముండి రెలమితోడను ||వినరె మనుజులార||
పరిమళంపు తైలమేసు చరణములకుఁ బూసిన యీ మరియ సోదరుండు రోగ భరితుఁడయ్యెను ||వినరె మనుజులార||
వ్యాధిచేత లాజరుండు బాధనొందుచుండఁ గ్రీస్తు నాధుఁ బిలువనంపి రపుడు నాతు లిరువురు ||వినరె మనుజులార||
తమ్ము డక్క సెలియలును బ్రి యమ్ము తనకుఁ గలిగియుండ నమ్మహాత్ముఁ డైన క్రీస్తుఁ డరిగె నచటికి ||వినరె మనుజులార||
యేసువచ్చు టెఱిగి మార్త యెదురు గానుఁ బోయి తనదు దోసిలొగ్గి మ్రొక్కి ప్రభువు తోడ బల్కెను ||వినరె మనుజులార||
కర్త నీకు దేవుఁడిచ్చు ఘనబలమెఱుగుదును సత్య వర్తి విచట లేని కతన వ్రాలె లాజరు ||వినరె మనుజులార||
పిదప మరియవచ్చి క్రీస్తు పదయుగమున కొరిగి యేడ్చి మొదట మార్త పలికినట్లు సుదతి పలికెను ||వినరె మనుజులార||
అపుడు కర్త వారిపలుకు లాలకించి మదిని మూల్గి కృపకుఁ బాత్రు రాలితోడ నపుడు నడిచెను ||వినరె మనుజులార||
నడిచి లాజరుని సమాధి కడకుఁ జేరి గుహను మూయఁ బడిన రాయి తీయుఁడనుచుఁ ప్రభువు చెప్పెను ||వినరె మనుజులార||
యేసుతోడ మార్తపలికె నీ సమాధినునిచి నాల్గు వాసరంబులయ్యెఁ గంపు పట్టి యుండదా ||వినరె మనుజులార||
దాని నమ్మి చూడుమని మ హానుభావుఁ డాత్మబలము నూని తండ్రికిపుడు స్తోత్ర మొనరఁజేసెను ||వినరె మనుజులార||
లాజరు సమాధినెడలి రమ్ము లెమ్మటంచు లోక పూజితుఁడు మహా రవంబుఁ బూని పల్కెను ||వినరె మనుజులార||
మరణమైనవాఁడు ప్రాణ భరితుఁడగుచు లేచి వచ్చెఁ తరుణులధిక హర్షలైరి పెదజనంబుతో ||వినరె మనుజులార||
కన వినంగ రాని యిట్టి ఘన మహాద్భుతంబుఁ జూచి జనులు క్రీస్తు యేసునాధు ననుసరించిరి ||వినరె మనుజులార||
కనుక మనము వానిఁ జేరు కొని సుఖంబుఁ బడయవచ్చు మనసు నిలిపి యతనియందు మనుట మేలగున్ ||వినరె మనుజులార||