యేసు నాథ కథా సుధా రస మిదిగో పానముఁ జేయరే దోసకారి జనంబులారా దురిత భవముల బాయరే ||యేసు నాథ||
ఇహపరంబు లెవనిచే సృజి యింపఁబడియెనొ చూడరే అసహహ యా విభుఁ డవతరించెను అతని గుణములఁ బాడరే ||యేసు నాథ||
దురిత భరితుల దుష్ట చరితుల నరయ వచ్చెను జూడరే స్థిరముగామది నమ్మి యా ప్రభు కరుణ మదిఁ గొనియాడరే ||యేసు నాథ||
పనికిమాలిన వేలుపుల దెస పరుగు లెత్తుట మానరే తనువు మీ కొఱ కిచ్చు క్రీస్తుని దయకుఁ బాత్రతఁ బూనరే ||యేసు నాథ||
మరణ బలి రక్తమున మన యం దఱిని బ్రోవను వచ్చెను కరుణతోఁ బాపులఁ బిలుచు గురు దరికిఁబోవుద మిచ్ఛను ||యేసు నాథ||
పరమతత్వ విధాన బోధలు బాగుగఁ బ్రకటించెను చిరసుఖాస్పద పదముఁ గోరిన జీవులకు వినిపించెను ||యేసు నాథ||
మరణ మొందిన కొందఱికిఁ దా మరలఁ బ్రాణము లిచ్చెను వర మహాద్భుత కార్యముల ని ద్ధర ననేక మొనర్చెను ||యేసు నాథ||
కుటిల బుద్ధుల ద్రోచి సజ్జన గోష్టి నుండుట గోరరే దిటముగను నెమ్మదిని మీరొం దుటకుఁ క్రీస్తునిఁ జేరరే ||యేసు నాథ||